సీడ్ పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్య దర్శి పాండురంగారెడ్డి కోరారు. -
September 08, 2023 గద్వాల టౌన్, సెప్టెంబరు 7 : సీడ్ పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్య దర్శి పాండురంగారెడ్డి కోరారు. పట్టణంలోని సీఐటీ యూ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది దాదాపు పదివేల ఎకరాల్లో సాగు చేసిన సీడ్‌పత్తికి ఎర్రతెగులు సోకడంతో రైతులు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోయారన్నారు. గత జూన్, జూలై మాసాల్లో రెండు సార్లు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సందర్భంగా కలెక్టర్ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ఇదే సమస్యపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునంద్‌రావుకు విన్నవించినట్లు తెలిపారు. ఎకరాకు రూ.50 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని, సీడ్ పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.700లకు పెంచాలని, పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని, కంపెనీలు ఎకరాకు లక్ష రూపాయల వరకు వడ్డేలేని రుణం ఇవ్వాలని కోరారు. ఫౌండేషన్ సీడ్‌ను ఉచితంగా ఇవ్వాలని, జిన్నింగ్ జరిగిన నెల లోపు రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు, కంపెనీల మధ్య రాత పూర్వక ఒప్పందం చేసుకుని, ఒక కాపీని రైతులకు ఇవ్వాలని కోరినా ఇప్పటి వరకు సంబంధిత అధికారుల నుంచి తగిన ఆదేశాలు రాలేదన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మరోసారి ఉద్య మానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు వీవీ నరసింహ, సీతా రాములు, మోషా, తిమ్మప్ప, సులేమాన్, శివన్న తదితరులు పాల్గొన్నారు.